గురువారం 23 సెప్టెంబర్ 2010

నిశీధి అవస్థ

ఒక ప్రార్థన, మనసులోంచి పెల్లుబికే

ఉన్మాదాన్ని తగ్గించాలని.

కలల సవ్వడి

మనసు చేసే ఆక్రందనల

సమాహారం

భూత భవిష్యత్ వర్తమానాల

జీవన వ్యాసంగం

నిన్నటి కల ... నేటి జాగృతి...

రేపటి ఊహా విహంగం

విహాయస డోలాయమానం

శరత్కాలపు పున్నమి వెన్నెలలా

జీవితంలో ప్రవేశించిన ఆమె

ఎప్పుడు వెళ్లిందో తెలీని స్పృహ

ఇంకా ప్రక్కనే ఉండి చిరునవ్వులు

చిందిస్తున్న జ్ఞాపకం

భ్రమిస్తున్న మనసు

ఇంకా జ్ఞాపకాల వేడిలో

పరిభ్రమిస్తూనే ఉంది.

నిన్నటి వాస్తవం జీర్ణం కాని చరిత్ర

ఇవాల్టి నిజం రేపది స్వప్నం

గతకాలపు నీడలు ఇంకా వీడలేదు

స్వప్నానికీ, జాగృతికీ

మధ్యనున్న అగాధంలో

వర్ణనకందని విషాద వ్యథ

తేడా కనుక్కోలేని చిత్రమైన అవస్థ

ఒక్కోసారి, వాస్తవంకంటే

స్వపంలో బ్రతకడమే

మేలనిపిస్తుంది. కాని జీవితం

కలగానే మిగిలిపోతే ఎలా అనిపించి

వెనక్కి తిరిగిచూస్తే

వెక్కిరింత లాంటి గతం

స్పష్టతనిచ్చి ముందుకు తోస్తుంది

జీవితపు చివరిక్షణం వరకూ

పోరాడాలనే తత్వం నా రక్తంలో ఉందేమో

అందుకే అది స్థిరంగా కూర్చోనీదు

ఏదో రాయాలనుకుంటే

మాటలు దొరకని ఖర్మమో, ఇదేమి అవస్థ