గురువారం 9 జూలై 2009

ఒకే ప్రశ్న..

చేసిన కష్టం చేతికి రాక,
పచ్చని పంట నష్టపోయినపుడు,
బ్రతుకుదెరువుకు పట్నానికి
వలస పోయినపుడు,
పట్నంలో పని దొరక్క
పిచ్చివాడిలా తిరిగినపుడు,
కూలి లేక,కూడు లేక
నిద్రలేని రాత్రులు గడిపినపుడు,
ఆకలికి తాళలేక రోడ్డుపై
సొమ్మసిల్లినపుడు,
నిలువనీడలేక, నిద్రకు ఓర్వలేక
ఖాళీకడుపుతో పుట్ పాత్ పై
పడుకున్నపుడు,
అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావ్రా?
అని పోలిసుల చేతిలో లాఠీ
దెబ్బలు తిన్నపుడు,
బిక్షమెత్తుదామని చేయి చాస్తే
దుక్కలాఉన్నావ్! పని చేస్కోపో
అని జనం కసిరినపుడు,
ఖర్మ కాలి ట్రాఫిక్ లో ఏ లారీ
కిందో పడి మరణించినపుడు,
అపుడూ, ఇపుడూ, ఎపుడూ
అతనిలో ఒకే ప్రశ్న!
"నువ్వేడున్నావని?
నీ బ్రతుకేమయిందని?"